రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

  • ప్రజల సమగ్ర డేటా అనుసంధానం ద్వారా మెరుగైన పౌర సేవ‌లు అందుతాయన్న సీఎం చంద్రబాబు
  • అర్హులకే పథకాలు అందేలా ఆర్టీజీఎస్ ఉపయోగపడాలన్న సీఎం
  • పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలని తెలిపిన సీఎం
రాష్ట్ర ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వ‌న‌రుగా ఉండాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. స‌చివాల‌యంలో శుక్రవారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్‌లో జ‌రుగుతున్న డేటా ఇంటిగ్రేష‌న్ ప‌నులను గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేప‌డుతున్న డేటా ఇంటిగ్రేష‌న్ ప‌నుల ప్రగ‌తి గురించి ముఖ్యమంత్రికి వివ‌రించారు.  

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ డేటా అందించే ఏకైక వ‌న‌రుగా ప‌నిచేయాల‌ని అన్నారు. అన్ని విభాగాల్లోని డేటాను ఒక వేదిక‌పైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ ప‌థ‌కాలు, కార్యక్రమాలను డేటా ద్వారా విశ్లేషించాల‌న్నారు. ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక స‌దుపాయ సాధ‌నంగా, అన్ని వేళ‌లా స‌హాయ‌కారిగా ప‌నిచేయాల‌ని సూచించారు. 

పౌరులు ఇప్పటికి కూడా త‌మ‌కు కావాల్సిన ప్రాథ‌మిక‌మైన ‌ధ్రువీకర‌ణ ప‌త్రాలు, జ‌న‌న‌, మ‌ర‌ణ ‌ధ్రువీకర‌ణ ప‌త్రాలు, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి ‌ధ్రువీకర‌ణ ప‌త్రాల కోసం అధికారులు, కార్యాల‌యాల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేయాల్సి వ‌స్తోంద‌ని ఈ విధానం మారాల‌న్నారు. ప్రభుత్వం ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాల్సిన సేవ‌ల‌న్నీ సులభంగా అందేలా చేయ‌నుంద‌ని, ఆ దిశ‌గా ప‌ని చేయాల‌న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 ల‌క్షల మంది పౌరులకు సంబంధించి డేటా లేద‌ని అధికారులు వివరించగా, ఈ డేటాను స‌త్వరం సేక‌రించి అనుసంధానించే చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని గృహాల‌ను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాల‌ని సూచించారు. 

వాట్సాప్ ద్వారా ఈ నెలాఖ‌రుకు వంద సేవ‌లు పౌరుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేస్తున్నట్లు సీఎంకు ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేశ్ వివరించారు. అలాగే 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా త‌మ విద్యార్హత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు పొందేలా కూడా చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప‌నులు వేగ‌వంతంగా చేస్తున్నామ‌ని వివ‌రించారు. మార్చి నెలాఖ‌రు నుంచి పూర్తి స్థాయిలో ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అందుబాటులోకి తేవాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
,


More Telugu News