GSAT 20: ఎలాన్ మస్క్‌ ‘స్పేస్‌ఎక్స్’ రాకెట్ నుంచి ఇస్రో జీశాట్-20 శాటిలైట్ ప్రయోగం విజయవంతం

ISRO communications satellite successfully launched into space by SpaceXs Falcon 9 rocket

  • స్పేస్‌ఎక్స్, ఇస్రో సహకారంలో తొలి ప్రయోగం గ్రాండ్ సక్సెస్
  • జీశాట్ 20 పూర్తి వాణిజ్య ఉపగ్రహం
  • దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటు విమానాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించే అవకాశం

అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయోగం చేపట్టారు. అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన ఈ శాటిలైట్ 34 నిమిషాలు ప్రయాణించి లక్షిత కక్ష్యలోకి చేరింది.

జీశాట్20 ఉపయోగాలు ఏమిటి? 
జీశాట్ 20 ఉపగ్రహాన్ని జీశాట్ ఎన్-2 అని కూడా పిలుస్తారు. ఏకంగా 4,700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించినది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు. అంతేకాదు విమానాల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్‌ సేవలను అందించవచ్చు. విమానాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించవచ్చు.
 
ఇస్రో వాణిజ్య విభాగం ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా చేపట్టిన జీశాట్-20 ప్రయోగం అత్యంత కీలకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య మొదటి భాగస్వామ్యం ఇదేనని తెలిపారు. అధునాతన కా-బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో ఇస్రో రూపొందించిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ ఉపగ్రహం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ సేవల సామర్థ్యాన్ని, కవరేజీని పెంచుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా 4,700 కిలోల బరువున్న పేలోడ్‌ను ప్రయోగించగల రాకెట్‌లు ఇస్రో వద్ద లేవు. ఎల్‌వీఎం-3 రాకెట్ గరిష్ఠంగా 4,000 కిలోల వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో జీశాట్20 ప్రయోగం కోసం స్పేస్‌ఎక్స్‌తో ఇస్రో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News