KTR: మణిపూర్, లక్షద్వీప్ కంటే ఇదేమీ చిన్నది కాదు... తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలి: కేటీఆర్

KTR says PM Modi and Rahul should talk about Lagacharla issue

  • లగచర్ల ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్
  • గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నారని ఆగ్రహం
  • సీఎం సోదరుడికి కలెక్టర్ స్వాగతం పలకడం దారుణమన్న కేటీఆర్

లగచర్ల ఘటన మణిపూర్, లక్షద్వీప్ కంటే చిన్నదేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులతో కలిసి ఆయన జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... లగచర్ల ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ఈ దేశానికి తెలియాలన్నారు.

గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్ధరాత్రి సమయంలో పోలీసుల దాడులు దారుణమన్నారు. గిరిజన రైతులపై దాడి చేసినా కేసులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ సీఎం సోదరుడికి కలెక్టర్ స్వాగతం పలకడం దారుణమన్నారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళపై పోలీసులు దాడి చేశారని, గిరిజన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లగచర్ల ఘటనపై మోదీ, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే స్పందించాలన్నారు. సీఎం సోదరుడి కంపెనీ కోసం ఎంతోమంది గిరిజనులను బాధపెడుతున్నారన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియనట్లుగా బీజేపీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. లగచర్లలోని పేద గిరిజనులు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసిందని, కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.

ఫార్మా సిటీ కోసం తమ హయాంలో రైతులను ఒప్పించి 14 వేల ఎకరాలను సేకరించి ఉంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలతో మోసం చేసిందని మండిపడ్డారు. లగచర్ల అంశాన్ని తాము రాజ్యసభలో లేవనెత్తుతామన్నారు. లోక్ సభలోనూ ఈ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. భూములు ఇవ్వకపోతే తొక్కుతామని సీఎం సోదరుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News