Acidity: టేస్టీగా ఉందని ఎక్కువగా తింటే... ఈజీగా జీర్ణం అయ్యే టిప్స్ ఇవిగో!
- అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు
- తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం వల్ల ఇబ్బంది
- చిన్న చిన్న జాగ్రత్తలతో ఇబ్బంది తప్పించుకోవచ్చంటున్న నిపుణులు
ఇంట్లోగానీ, బయటగానీ ఒక్కోసారి ఎక్కువగా ఎక్కువగా తినేస్తుంటాం. రుచి నచ్చడం వల్లనో, స్నేహితులు, బంధువుల ఒత్తిడితోనో పరిమితికి మించి భోజనం చేస్తుంటాం. అలాంటి సమయంలో ఒక్కోసారి తిన్నది సరిగా అరగకపోవడం వల్లనో, ఎసిడిటీ సమస్యతోనో ఇబ్బంది పడుతుంటాం. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అందులో కొన్ని మనకు తెలిసినవే అయినా... సరిగా పాటిస్తే సమస్య నుంచి బయటపడతామని వివరిస్తున్నారు.
- కాస్త ఎక్కువగా భోజనం చేసినప్పుడు... ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే నిద్రపోవడం, మెలకువతో ఉండీ పడుకోవడం వంటివి చేయవద్దు. అలా చేస్తే ఎసిడిటీ సమస్య వస్తుంది. భోజనం అయ్యాక ఒకట్రెండు గంటల పాటు నిటారుగా కూర్చోవడం మంచిది.
- నిదానంగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. ఇది కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- కాస్త గోరువెచ్చని నీళ్లుగానీ... పాలు లేకుండా అల్లం, పుదీనాతో తయారుచేసిన టీ గానీ తీసుకుంటే... ఆహారం వేగంగా జీర్ణమవుతుంది.
- భోజనం చివరిలో కాస్త పెరుగు, మజ్జిగ వంటివి తీసుకుంటే ఎసిడిటీ సమస్య ఉండదు. వేగంగా జీర్ణం అవుతుంది కూడా.
- అతిగా ఆహారం తీసుకున్నప్పుడు కాసేపు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అన్నట్టుగా నడవాలి. వేగంగా నడిస్తే... మొదటికే మోసం వచ్చి, ఇబ్బంది మరింత పెరుగుతుంది.
- పరిమితికి మించి భోజనం చేసినప్పుడు... తర్వాత తీసుకునే ఆహారాన్ని కాస్త లేటుగా తినాలి. జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. కావాలంటే సులువుగా జీర్ణమైపోయే అరటి పండ్లు, బొప్పాయి పండ్లు వంటివి తీసుకోవాలి.
- ఆహారం సులువుగా జీర్ణమయ్యేందుకు తోడ్పడే సోంపు వంటివి తీసుకోవడం వల్ల కూడా లాభం ఉంటుంది.