Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎలక్ట్రిక్ వాహనదారులకు బంపరాఫర్

Telangana government has announced exemption of road tax and registration fee on electric vehicles

  • ఎలక్ట్రిక్ వాహనాలపై రెండేళ్లపాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు
  • 100 శాతం ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం
  • డిసెంబర్ 2026 చివరి వరకు అవకాశం
  • ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు సహా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపు
  • కాలుష్య నియంత్రణే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

ఎలక్ట్రిక్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలపై రోడ్‌ ట్యాక్స్‌ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్‌ ఫీజు 100 శాతం మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా  ఈ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరో రెండేళ్ల వరకు ట్యాక్స్‌లను రద్దు చేస్తూ జీవోను కూడా జారీ చేసింది. దీంతో ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సుల కొనుగోలు చేసినవారికి భారీ ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

సోమవారం (నేటి) నుంచి రాష్ట్రంలో నూతన ఈవీ పాలసీని అమలు చేయడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. సోమవారం నుంచి ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం పన్ను మినహాయింపులు ఉంటాయని వివరించారు.

ఇక డిసెంబర్ 31, 2026 వరకు తెలంగాణలో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులపై లైఫ్ టైమ్ రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి ఉపశమనం ఇవ్వనున్నట్టు పొన్నం ప్రభాకర్ వివరించారు. అయితే ఈ బస్సులను తప్పనిసరిగా నడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీజీఆర్టీసీ బస్సులతో పాటు తమ సొంత ఉద్యోగుల రవాణా కోసం కంపెనీలు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే ప్రైవేటు కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తే ప్రయోజనాలు దక్కవని క్లారిటీ ఇచ్చారు. అలాగే కాలుష్య స్థాయులను నియంత్రించేందుకు హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రూ.10 లక్షల లోపు ధరతో కారు కొనుగోలు చేసినవారికి రూ.1.40 లక్షల నుంచి రూ.1.90 లక్షల దాకా ట్యాక్స్ మిగులుతుంది. ఇక బైక్‌లు, కార్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలో రూ.1500-రూ.2,000 వరకు మిగులుతుంది. కాగా ఎలక్ట్రిక్ వాహనాలతో శబ్ద, వాయు కాలుష్యాలు తగ్గుతాయి.

  • Loading...

More Telugu News