minister narayana: ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం: మంత్రి నారాయణ
- నెల్లూరు నగర పాలక సంస్థలో వివిధ శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
- త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడి
- ప్రజలు పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి
ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నాటికి భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత కొత్త విధానాలను రూపొందించామని వెల్లడించారు.
అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి నారాయణ .. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులను సత్వరమే కట్టాలని కోరారు. పన్నుల వసూళ్లకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను సైతం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య సంస్థల బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.