Kalki Avatar: ఈ బాలుడు కల్కి అవతారమట.. దివ్యశక్తులున్నాయంటూ ప్రచారం!
- ఒడిశా రాజధాని ఖండగిరి శ్రీ వైకుంఠధామ్‌లో ఉద్రిక్తత
- జగన్నాథుడి పాదాల చెంత ఉంచి పూజించే పవిత్ర తులసిని బాలుడి పాదాల చెంత ఉంచడంపై ఆగ్రహం
- ఆశ్రమంలోకి ప్రవేశించేందుకు సేవాయత్‌లు, భక్తుల ప్రయత్నం
- అడ్డుకున్న బాలుడి మద్దతుదారులు
- విచారణకు ఆదేశించిన శిశు సంక్షేమ కమిటీ
- తన కుమారుడు దేవుడు కాదని తండ్రి వివరణ
- తన కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
బాలుడిని కల్కి అవతారంగా ప్రచారం చేస్తూ పూజించడంపై ఒడిశా, భువనేశ్వర్‌లోని ఖండగిరి శ్రీ వైకుంఠధామ్‌లో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్నాథుడి పాదాల చెంత ఉంచి పూజించే పవిత్ర తులసిని బాలుడి పాదాల చెంత ఉంచి పూజించడంతో సేవాయత్‌లు, భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాలుడికి దివ్యశక్తులున్నాయని ప్రచారం జరిగింది. ఆశ్రమంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బాలుడి మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
విష్ణుమూర్తి కల్కి అవతారంగా చెబుతున్న బాలుడి తండ్రి కాశీనాథ్ మిశ్రా మాట్లాడుతూ తన కుమారుడు భగవంతుడు కాదని స్పష్టత నిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆశ్రమంతో తన కుమారుడికి ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. తన కుటుంబానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో పదేళ్ల క్రితం తీసినదని, అప్పుడు తన కుమారుడి వయసు ఐదేళ్లని కాశీనాథ్ మిశ్రా పేర్కొన్నారు. తన స్నేహితుడి ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల సమయంలో ఆ ఫొటోను తీసినట్టు చెప్పారు. ఆ ఫొటోలో తాను కానీ, తన భార్య కానీ లేమని పేర్కొన్నారు. ఆశ్రమ కార్యకలాపాలతో తన కుమారుడికి ఎలాంటి సంబంధమూ లేదని పునరుద్ఘాటించారు.
సమాజం ముందు తమ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు తుంటరులు తప్పుడు సమాచారన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. బాలుడిని ‘గురు’గా పూజిస్తున్నారన్న ఆరోపణలు అర్థరహితమని తేల్చి చెప్పారు. జగన్నాథుడి సంస్కృతిని, సనాతన ధర్మానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే పనిలో తాను బిజీగా ఉన్నానని, తన కుమారుడు కూడా కుటుంబ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడని చెప్పారు.
కాగా, బాలుడు కల్కి అవతారంగా ప్రచారం కావడంపై శిశు సంక్షేమ కమిటీ కాశీనాథ్ మిశ్రాపై సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిపై లోతైన విచారణ జరపాలని జిల్లా శిశు సంరక్షణ అధికారి ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు.