Bomb blast: టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టిన స్టూడెంట్లు... హర్యానాలో దారుణం
- యూట్యూబ్ లో చూసి బాణాసంచాతో బాంబు తయారీ
- బాంబు శబ్దంతో ఉలిక్కిపడిన పాఠశాల
- విద్యార్థులను సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
క్లాస్ రూంలో అల్లరి చేస్తున్నారనో, సరిగా చదవడంలేదనో ఓ టీచర్ తన విద్యార్థులను మందలించింది. కాస్త గట్టిగానే తిట్టిందేమో... విద్యార్థులు అవమానంగా భావించారు. ఎలాగైనా టీచర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి రిమోట్ తో పేల్చేశారు. హర్యానాలోని ఓ స్కూల్ లో జరిగిందీ ఘటన.
హర్యానాలోని ఓ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులను సైన్స్ టీచర్ తిట్టారు. చదువుపై శ్రద్ధ పెట్టాలంటూ బుద్ధి చెప్పారు. దీంతో క్లాస్ లో అందరిముందూ అవమానించిందని టీచర్ పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి బాణాసంచాతో బాంబు తయారు చేశారు. దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు. టీచర్ క్లాస్ రూంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చేశారు.
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూలు మొత్తం ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి కుర్చీ దెబ్బతింది. టీచర్ కు ప్రమాదమేమీ వాటిల్లలేదు. ఏం జరిగింది, ఎలా జరిగిందని ఆరా తీయగా విద్యార్థుల నిర్వాకం బయటపడింది. దీంతో తీవ్రంగా మండిపడ్డ ప్రిన్సిపాల్... ఆ విద్యార్థులను వారం పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.