Champions Trophy 2025: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్... నో చెప్పిన ఐసీసీ!
- వచ్చే ఏడాది పాక్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ
- కప్ ను పాక్ లోని వివిధ నగరాల్లో ప్రదర్శించనున్న పీసీబీ
- పీవోకేలోని మూడు నగరాల్లో ప్రదర్శించేందుకు సన్నాహాలు
- బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో జోక్యం చేసుకున్న ఐసీసీ!
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీకి ప్రచారం కల్పించేందుకు... ట్రోఫీని పాకిస్థాన్ లోని వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ ను పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మూడు నగరాల్లో కూడా నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది.
పీవోకే కిందకు వచ్చే స్కర్దు, హంజా, ముజఫరాబాద్ నగరాల్లోనూ ఈ ట్రోఫీని ప్రదర్శించాలని పీసీపీ ప్లాన్ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అందుకు అనుమతి నిరాకరించింది. ఆ ఆలోచన విరమించుకోవాలని సూచించింది. అందుకు కారణం బీసీసీఐనే.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ ఇస్లామాబాద్ నుంచి నవంబరు 16న ప్రారంభం కానుందని పీసీబీ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఏ ఏ నగరాల్లో ఈ ట్రోఫీని ప్రజల సందర్శనార్థం ఉంచుతారో కూడా పీసీబీ పేర్కొంది. అందులో పీవోకే నగరాలు కూడా ఉన్నాయి.
దాంతో, పీసీబీ ప్రణాళిక పట్ల బీసీసీఐ అభ్యంతరం చెప్పిందని, అందుకే ఐసీసీ నో చెప్పిందని కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే పాకిస్థాన్ లో తాము అడుగుపెట్టేది లేదని భారత్ తెగేసి చెబుతుంటే... ఇప్పుడు ఈ ట్రోఫీని పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రదర్శించాలని పీసీబీ భావించడం పట్ల ఐసీసీ అసంతృప్తితో ఉందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.
కాగా, భారత్ ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనదో వివరణ అడగాలని పీసీబీ ఇప్పటికే ఐసీసీకి లేఖ రాసింది. అంతేకాదు, భారత జట్టు తమ దేశంలో అడుగుపెట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) ను ఆశ్రయించాలని కూడా పాక్ బోర్డు భావిస్తోంది.