new bridge: పంబన్ రైలు బ్రిడ్జిపై హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ విజయవంతం
- సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో వర్టికల్ లిఫ్ట్ వంతెన నిర్మాణం
- వంతెనను పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి
- పంబన్ రైలు వంతెనపై హైస్పీడ్ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతమైనట్లు వెల్లడి
భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే భారీ వంతెన (పంబన్) పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు.
ఈ క్రమంలో నవంబర్ 13,14 తేదీల్లో తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్‌ను, మండపం నుండి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్‌ను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కొత్త పంబన్ రైల్వే వంతెన పునాది నిర్మాణాన్ని పరిశీలించామనీ, లిఫ్టింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించామని మధురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ వెల్లడించారు. హైస్పీడ్ ట్రైన్ ట్రైల్ రన్ మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కిలోమీటర్ల వేగంతో 15 నిమిషాలు పట్టిందని చెప్పారు.