Patnam Narendar Reddy: కేటీఆర్ ఆదేశాల మేరకే కుట్ర పన్నారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు

Patnam Narendar Reddy names KTR name in Remand report

  • కేటీఆర్ పాత్ర గురించి నరేందర్ రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు
  • కాల్ డేటా రికార్డును విశ్లేషించేందుకు కోర్టు అనుమతి కోరిన పోలీసులు
  • నిందితుడు, నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విచారణ క్రమంలో కేటీఆర్ పాత్ర గురించి ఆయన చెప్పినట్లు అందులో వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ప్రధాన నిందితుడు సురేశ్‌ను పురమాయించినట్లు పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఫోన్ కాల్ డేటా రికార్డును విశ్లేషించేందుకు కోర్టు అనుమతిని కోరారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దాడి జరిగిన రోజు వరకు సురేశ్‌కు, నరేందర్ రెడ్డికి మధ్య 84 ఫోన్ కాల్స్ సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో దాడి జరిగిన రోజు మాత్రం ఒకసారి మాట్లాడినట్లు గుర్తించారు.

లగచర్ల ఘటన కుట్ర వ్యూహరచనలో నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, అందుకు అవసరమైన ఆర్థిక వనరులతో పాటు నైతిక మద్దతు ఆయనే సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీని వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఉందని తెలిపారు. అందుకే పలు గ్రామాలకు చెందిన రైతులను సురేశ్ రెచ్చగొట్టారని, భూసేకరణకు వచ్చే అధికారులపై దాడులకు పురిగొల్పారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టుకు తీసుకువెళ్తుండగా ఆయన కారు అద్దాలు తీసి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆయన వెళ్తున్న పోలీస్ వాహనాన్ని మీడియా వెంబడించింది. ఈ క్రమంలో ఆయన వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు.

నిందితుల్లో 19 మందికి భూమి లేదు: ఐజీ సత్యనారాయణ

లగచర్ల దాడి ఘటనలో 42 మంది పాల్గొన్నారని, అందులో 19 మందికి భూమి కూడా లేదని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఈ దాడి ఘటనలో కుట్ర కోణం ఉందని తెలిపారు. కలెక్టర్‌పై దాడి చేస్తున్న సమయంలో భూములు కోల్పోతున్న రైతులు వారిని వారించినట్లు తెలిపారు. ఎవరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం లేదని, దాడికి పాల్పడిన వారినే ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 35 మందికి సంబంధం లేదని తెలిసి వారిని వదిలేసినట్లు చెప్పారు. ఈ ఘటనతో సంబంధం లేనివారు దర్జాగా ఉండవచ్చునన్నారు.

  • Loading...

More Telugu News