Ian Botham: మొసళ్ల మధ్యలో పడిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!
- తన ఫ్రెండ్ మాజీ క్రికెటర్ మెర్వ్ హ్యూస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన బోథమ్
- ఆస్ట్రేలియాలోని మోయిల్ నదిలో ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లిన సమయంలోనే ప్రమాదం
- మొసళ్లతో కూడిన నదిలో పడవ మీద వెళ్తుండగా జారి నీటిలో పడిపోయిన బోథమ్
- పడవలోని మిగతావాళ్లు వెంటనే బయటకు లాగేయడంతో తప్పిన ప్రమాదం
ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెర్వ్ హ్యూస్‌తో కలిసి ఆయన ఇటీవల ఆ దేశంలో పర్యటించారు. ఈ క్రమంలో ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లిన సమయంలో మొసళ్లతో కూడిన నదిలో పడవ మీద వెళ్తుండగా జారి నీటిలో పడిపోయారు.
వెంటనే హ్యూస్‌తో పాటు ఆ పడవలో ఉన్న మిగతావారు ఆయన్ను పడవలోకి లాగేశారు. ఈ క్రమంలో బోథమ్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారు.
కాగా, ప్రమాదం జరిగినప్పుడు ఉత్తర ఆస్ట్రేలియాలోని మోయిల్ నదిపై పడవలో ఉన్న బృందంలో ఈ ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. ఈ ఘటనను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బోథమ్ అభిమానులతో పంచుకున్నారు. "నా క్యాచ్ ఆఫ్ బర్రా (చేప). అయితే నేను మొసళ్లు, బుల్ షార్క్‌లకు క్యాచ్ అయ్యేవాడిని. దాదాపుగా వాటి నోటికి చిక్కినట్టే అనిపించింది. నేను నీటిలోకి వెళ్లిన దానికంటే త్వరగా బయటపడ్డాను. అదృష్టవశాత్తూ నాకు ఏమీ కాలేదు. కుర్రాళ్ళు తెలివైనవారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నన్ను సమయానికి బయటకు తీసుకొచ్చినందుకు పడవలోని వాళ్లకు ధన్యవాదాలు" అని బోథమ్ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.
కాగా, బోథమ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. ఆయన తన కెరీర్లో టెస్టుల్లో 5,200 పరుగులు చేశారు. అలాగే 383 వికెట్లు తీసుకున్నారు. ఆయన 1992లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడారు.