Tricholotomania: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. ఆమె పొట్టలోంచి 2 కేజీల తలవెంట్రుకలు తీసిన వైద్యులు!

UP woman complains of severe stomach ache and doctors remove 2 kg hairball

  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
  • అత్యంత అరుదైన ట్రైకోలోటోమేనియాతో మహిళ బాధపడుతున్నట్టు గుర్తించిన వైద్యులు
  • ఆ రుగ్మతతో బాధపడేవారిలో జుత్తు తినాలన్నకోరిక ఉంటుందన్న డాక్టర్లు
  • 15 ఏళ్లుగా తింటున్న వెంట్రుకలు కడుపులో ఉండలా పేరుకుపోయి అవయవాల పనితీరుకు ఆటంకం
  • 25 ఏళ్లలో బరేలీలో ఇది తొలి కేసున్న వైద్యులు

కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన 31 ఏళ్ల మహిళను పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. ఆమె పొట్టలో ఏకంగా రెండు కిలోల తలవెంట్రుకలు కనిపించడంతో షాకయ్యారు. ఆపై శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిందీ ఘటన. బాధిత మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతూ గత 15 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్నట్టు గుర్తించారు. 

చాలా కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె ‘ట్రైకోలోటోమేనియా’ అనే అరుదైన రుగ్మతతో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సమస్యతో బాధపడేవారిలో జుత్తు తినాలనే కోరిక బలంగా ఉంటుంది. బరేలీలో ఇలాంటి ఘటన వెలుగు చూడడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. 

మహిళకు 16 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఈ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి వెంట్రుకలు తింటుండడంతో అవన్నీ కడుపులో పేరుకుపోయి పెద్ద బంతిలా తయారయ్యాయి. ఇవి పేగులు, ఇతర అవయవాల పనితీరును దెబ్బతీసింది. పలుమార్లు ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

సెప్టెంబర్ 22న మరోమారు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బరేలీలోని మహారాణా ప్రతాప్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెకు పలు పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆమె కడుపులో తలవెంట్రుకల ఉండను గమనించి శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, ఆమెకు సైకలాజికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News