Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారం... పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ స్పందన
- తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- పవన్ కల్యాణ్ ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్
- సమస్యను జాతీయ స్థాయిలో ఎందుకు తీసుకువెళుతున్నారని ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్వచ్చమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన .. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని.. ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా శుక్రవారం కోరారు.
అలానే ఈ అంశంపై పవన్ కల్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) లోనూ పోస్టు పెట్టారు. దీనికి ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ కామెంట్స్ చేశారు. 'డియర్ పవన్ కల్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి విచారించండి.. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు? మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. (కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు)' అంటూ ప్రకాశ్ రాజ్ కౌంటర్ కామెంట్స్ చేయడం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.