అమ్మోరు, అరుంధతి తరహాలో "ఆదిపర్వం" అనుభూతిని పంచుతుంది

మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "ఆదిపర్వం". ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు సంజీవ్ మేగోటి.

- రచన, సంగీతం మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.

- 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం  ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. శ్రీకాంత్, పూరి జగన్నాథ్ నా ముందు బ్యాచ్, వినాయకుడు ఫేమ్ కృష్ణుడు నా క్లాస్ మేట్. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.

- "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ఉంటుంది. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.

- "ఆదిపర్వం" సినిమాలో మంచు లక్ష్మి గారు కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి గారు షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.

- ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలుగులో ప్రతి ఏరియా నుంచి డబ్బులు కట్టి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది మా సక్సెస్ అని భావిస్తా. ఎందుకంటే చిన్న చిత్రాలకు డిస్ట్రిబ్యూషన్ నుంచి డబ్బులు రావడం అనేది జరగదు. మా "ఆదిపర్వం" విషయంలో మేము పెట్టిన డబ్బులు సేఫ్ అయ్యేంత క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏంటనేది అనౌన్స్ చేస్తాం.

- ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తాం.

More Press News