వైవిధ్యభరితమైన కథలతో విజయాలను అందుకునే కథానాయకుడిగా నిఖిల్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపువుంది. 'కార్తికేయ-2' చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్, సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'స్వామిరారా' .. 'కేశవ' అనే చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో 'స్వామిరారా' చిత్రం నిఖిల్ కెరీర్‌ను ఊపందుకునేలా చేసింది. అయితే కరోనా సమయంలో నిఖిల్, సుధీర్ కలిసి చేసిన చిత్రమే 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' . అప్పట్లో ఓటీటీ కోసం చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కథ: కార్ రేసర్‌గా స్థిరపడాలనేది రిషి (నిఖిల్) కోరిక. అందుకు తగిన ప్రయత్నాల్లో ఉన్న అతను తార (రుక్మిణి వసంత్)ను ప్రేమిస్తాడు. స్నేహితుడు చేసిన ఓ మిస్ కమ్యూనికేషన్ వల్ల అప్పుడు అతని ప్రేమ సక్సెస్ కాదు. దాంతో రేసర్ కావాలన్న తన డ్రీమ్ కోసం 'లండన్' చేరుకుంటాడు. అక్కడ శిక్షణ పొందుతునే మరో వైపు పార్ట్ టైమ్ పనిచేస్తుంటాడు. దుండగులబారి నుంచి తను కాపాడిన తులసి (దివ్యాంశ కౌశిక్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఇందుకోసం గుడికెళ్లిన తులసి అక్కడ మిస్సవుతుంది? ఆమె కోసం వెతుకుతున్న రిషికి, తను ప్రేమించిన తార కలుస్తుంది. అసలు తార లండన్‌కు ఎందుకొస్తుంది? తులసిని వెతుకుతున్న క్రమంలో రిషికి తెలిసే నిజాలేమిటి? డాన్ బద్రీ నారాయణ ( జాన్ విజయ్)కి వీళ్లందరితో వున్న రిలేషన్ ఏమిటి? అసలు వీళ్లందరి మధ్య జరిగిందేమిటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైమ్ కథాంశానికి లవ్ స్టోరీని మిక్స్ చేసి ఓ కొత్త తరహా సినిమాని చూపించాలని చేసిన ప్రయత్నమిది. అయితే క్రైమ్ స్టోరీలో ఉండాల్సిన ఉత్కంఠ, ఉత్సుకత అసలు సినిమాలో ఎక్కడా కనిపించదు. ఏ మాత్రం ఆసక్తికరంగా లేని కథాంశంతో చేసిన ఈ సినిమాలో ఏ పాయింట్ కూడా ఆకట్టుకోదు. ప్రేమకథ కూడా ఎందుకు మొదలవుతుందో.. ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లు, ఏ మాత్రం ఉత్సుకత లేని మలుపులు బోలెడన్నీ వుంటాయి. అయితే అవేమీ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించవు సరికదా, చాలా బోరింగ్‌గా అసహజంగా అనిపిస్తాయి. స్లో నెరేషన్‌తో సినిమా మరింత నీరసంగా కొనసాగుతుంది. ఎక్కడా ప్రేక్షకులు ఆశించిన చమక్కులు మచ్చుకైనా కనిపించవు.
ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఫస్ట్‌హాఫ్‌తో పాటు సెకండాఫ్ కూడా ఓపికకు పరీక్ష పెడుతుంది. అసలు కథలో బలం లేకపోవడం వలన, ఎక్స్ ట్రా యాడెడ్‌లు ఎన్నిచేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ చిత్రంలో సత్య, సుదర్శన్, ప్రవీణ్ లాంటి కమెడియన్లు వున్నా, వినోదం కనిపించదు. చాలా సాదాసీదా కథతో ఎటువంటి ఆసక్తికరమైన అంశాలు లేకుండా అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో చేసిన బోరింగ్ సినిమా ఇది.
నటీనటుల పనితీరు: రుషిగా నిఖిల్ తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే అంతగా ఆయన పాత్రలో నటనకు పెద్దగా స్కోప్ కనిపించదు. దర్శకుడు ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. రుక్మిణీ క్యూట్‌గా వుంది. నటన కూడా ఫర్వాలేదు. దివ్యాంశ కౌశిక్ తన పాత్రకు న్యాయం చేసింది. హర్ష, సుదర్శన్, సత్యలు నవ్వించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. సాంకేతిక నిపుణుల్లో కెమెరామెన్ టాలెంట్ మాత్రం కనిపించింది.
సరైన కంటెంట్ లేకుండా అర్థం పర్థం లేని మలుపులతో కథను సాగతీయాలనే చేసిన ప్రయత్నం ఫలించలేదు. థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే కథ కానీ ఇతర అంశాలు కానీ ఈ చిత్రంలో మచ్చుకు కూడా కనిపించవు. అప్పుడెప్పుడో తీసిన ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమేనని చెప్పాలి.
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' - మూవీ రివ్యూ
| Reviews
Appudo Ippudo Eppudo Review
- అవుట్‌డేటెడ్ కథ - కథనాలు
- ఆకట్టుకోని క్రైమ్ థ్రిల్లర్
- కమెడియన్స్ ఉన్నా పండని వినోదం
- ఉత్కంఠ కలిగించని మలుపులు
- సాదాసీదా కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నిఖిల్
Movie Name: Appudo Ippudo Eppudo
Release Date: 2024-11-08
Cast: Nikhil, Rukmini Vasanth, Divyansha Koushik, Sathya, Sudarshan
Director: Sudheer Varma
Music: Karthik
Banner: Sri Venkateswara Cine Chitra
Review By: Madhu
Appudo Ippudo Eppudo Rating: 2.00 out of 5
Trailer