Priyadarshi: నేను అంతదూరం ఆలోచించను సార్: ప్రియదర్శి

- అంచలంచెలుగా ఎదిగిన ప్రియదర్శి
- హీరోగా వరుస సినిమాలతో బిజీ
- ఈ నెల 25వ తేదీన వస్తున్న 'సారంగపాణి జాతకం'
- హిట్ ఖాయమని వ్యాఖ్య
నటుడిగా ప్రియదర్శి కెరియర్ ను పరిశీలిస్తే, ఆయన అంచలంచెలుగా ఎదగడం స్పష్టంగా కనిపిస్తుంది. కెరియర్ ఆరంభంలో హీరో మిత్రబృందంలో ఒకరుగా కనిపిస్తూ వచ్చిన ఆయన, ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. రీసెంటుగా 'కోర్ట్' సినిమాతో హిట్ కొట్టిన ఆయన, 'సారంగపాణి జాతకం' సినిమాతో, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.
" ఏదైనా ఒక కథ పట్టుకుని దర్శకుడు నా దగ్గరికి వస్తే, ఆ సినిమాను ఒప్పుకోవాలా వద్దా? అనే విషయాన్ని గురించి మరీ లోతుగా ఆలోచన చేయను. లెక్కలు వేసుకుని నిర్ణయాలు తీసుకోను. నేను ఒక ప్రేక్షకుడిగానే ఆ కథను వింటాను. ఆ కథ బాగుందని నాకు అనిపిస్తే, అప్పుడు నిజాయితీతో నా నిర్ణయం చెబుతాను" అని అన్నాడు.
" ఈ కథను నేను కాకుండా వేరే హీరో చేస్తే నేను థియేటర్ కి వెళ్లి చూస్తానా? అని ఒక ప్రశ్న వేసుకుంటాను. తప్పకుండా వెళ్లి చూడవలసిన కథనే కదా అనిపిస్తే, అప్పుడు వెంటనే ఒప్పుకుంటాను. కథపై నాకున్న నమ్మకాన్ని నేను పరీక్షించుకుంటాను అంతే. అలా నమ్మిన కథనే 'కోర్ట్'. అంతే నమ్మకంతో 'సారంగపాణి జాతకం' చేశాను. తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాను" అని చెప్పాడు.