KTR: కేటీఆర్ కు డీకే అరుణ సవాల్

- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో ఓ బీజేపీ ఎంపీకి సంబంధం ఉందన్న కేటీఆర్
- దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలని కేటీఆర్ కు డీకే అరుణ సవాల్
- రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకటేనని విమర్శ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ బీజేపీ ఎంపీకి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు.
విజయవాడలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ కు దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పాలని సవాల్ విసిరారు. ఆ ఎంపీ ఎవరో చెప్పకుండా... ఓ ఎంపీ అంటూ గాలి మాటలు మాట్లాడితే సరిపోదని అన్నారు. దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టిందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచామని చెప్పారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉందని అన్నారు. ఏపీలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని... తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకటేనని... అందుకే తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన సమావేశానికి వెళ్లారని చెప్పారు. తమిళనాడులో స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి మాత్రమే అధికారంలో ఉండాలని అనుకుంటున్నారని విమర్శించారు.