BRS: రజతోత్సవ సభ కోసం హైకోర్టుకు బీఆర్ఎస్... విచారణ ఈ నెల 17కు వాయిదా

BRS Moves High Court for Silver Jubilee Meeting
  • వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరణ
  • సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ నేతల పిటిషన్
  • 17వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 17వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్‌లో కోరారు.

ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ పోలీస్ కమిషనర్, కాజీపేట ఏసీపీలను బీఆర్ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరఫున ఈ నెల 21వ తేదీ వరకు సమయం కోరారు. అయితే, సభకు ఏర్పాట్లు చేసుకోవలసి ఉన్నందున ఈ నెల 17వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
BRS
Telangana
High Court
Warangal
Elkurthi
Silver Jubilee
Public Meeting
Police Permission
Home Department
Political Rally

More Telugu News