Vamsy: ఆ హీరోయిన్ ను అలా సెలెక్ట్ చేశాను: దర్శకుడు వంశీ

- 1987లో వచ్చిన 'కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్'
- టైటిల్ పెద్దదనే విమర్శలు వచ్చాయన్న వంశీ
- మాధురి అలా కనిపించిందని వెల్లడి
- పోస్టర్ చూసి హీరోయిన్ ను ఎంపిక చేశామని వ్యాఖ్య
దర్శకుడిగా వంశీ శైలి విభిన్నం... విలక్షణం. చాలా తక్కువ బడ్జెట్ లో భారీ హిట్లు ఇచ్చిన దర్శకుడు ఆయన. ఇక ఆయన సినిమాలో కథ ఏదైనా పాటలు హిట్టు. ఇప్పటికీ ఆ సినిమాలను మళ్లీ మళ్లీ చూసేవారున్నారు. పాటలను పదే పదే వినేవారు ఉన్నారు. అలాంటి వంశీ సినిమాలలో 'శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్' ఒకటి. 1987లో విడుదలైన ఈ సినిమా, అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించింది.
తాజాగా తన వీడియోలో ఈ సినిమాను గురించి వంశీ ప్రస్తావించారు. ఈ సినిమాకి 'శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్- రాజమండ్రి' అనే టైటిల్ పెట్టాను. అయ్యబాబోయ్ టైటిల్ చాలా పెద్దది అయిందని అంతా అంటూ ఉంటే, చివర్లో ఉన్న 'రాజమండ్రి'ని తీసేశాను. అయినా టైటిల్ ఇంకా పొడుగ్గానే అనిపిస్తుందని అన్నారు. అయినా నేను ఇక పట్టించుకోలేదు. ఈ సినిమాకి సంబంధించిన పనులను చేస్తూ వెళ్లాను" అని అన్నారు.
"ఈ సినిమాలో హీరోగా నరేశ్ ను అనుకున్నాను. తాను విజయనిర్మలగారి కొడుకుననే గర్వం నరేశ్ కి ఎంతమాత్రం లేదు. ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం. ఆయన ఎంత మంచివాడనేది అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత కోడంబాకం రోడ్ లో మేము వెళుతూ ఉంటే, గోడపై 'సంసారం అదు మిన్సారం' (సంసారం ఒక చదరంగం) పోస్టర్ చూశాను. ఆ పోస్టర్ లో పెద్దకళ్లతో ఉన్న అమ్మాయిని చూసి బాగుందని అనుకున్నాను.
"ఆ సినిమాకి వెళ్లి థియేటర్లో కూర్చున్నాను. ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి తెరపైకి వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఆ అమ్మాయి వచ్చింది... పోస్టర్ పై కంటే కూడా బాగుందని అనిపించింది. ఆ తరువాత ఆ అమ్మాయిని గురించి వాకబు చేస్తే, తన పేరు 'మాధురి' అని తెలిసింది. ఆఫీసుకి పిలిపించి ఫొటో సెషన్ పెట్టాను. నా సినిమాలో ఆమెనే హీరోయిన్ అని అనుకున్నాను. ఆ తరువాతనే కోట, మల్లికార్జున్ రావు, రాళ్లపల్లి, భరణిలను ఎంపిక చేయడం జరిగింది" అని అన్నారు.