Sharada: నా సినిమాలలో నాకు నచ్చింది అదే: నటి శారద!

- నా అసలు పేరు సరస్వతి
- నేను ఇండస్ట్రీకి రావడం నాన్నకి ఇష్టం ఉండేది కాదు
- నాకు పేరు రావడం ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశం
- శోభన్ బాబు గారి మాట వినలేదన్న శారద
శారద .. ఒకప్పుడు వెండితెరపై వెలిగిపోయిన కథానాయిక. ఊర్వశిగా బిరుదును అందుకున్న శారద, వాయిస్ పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలలో రాణించిన హీరోయిన్స్ లో శారదనే ముందుగా కనిపిస్తారు. అలాంటి శారద వయసు పైబడిన కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మాది తెనాలి .. నా అసలు పేరు 'సరస్వతి'. నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ పేరుతో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారని తెలిసి మా నాన్నగారు 'శారద' అని మార్చారు. నిజానికి నేను సినిమాలలోకి రావడం మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ ప్రోత్సాహం వల్లనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను చేసిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. వాటిలో నాకు బాగా నచ్చిన సినిమా 'మనుషులు మారాలి'. ఆ సినిమాను 4 భాషలలో తీస్తే .. నాలుగు భాషల్లోను హీరోయిన్ గా నేనే చేశాను" అని అన్నారు.
"ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. ఇలా అందరితో చేశాను. ఎన్టీఆర్ గారి సినిమాలలో నా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆయన ఏమీ అనేవారు కాదు. అలా నాకు మంచి పేరు రావడానికి ఆయన ఒక కారణమని చెప్పొచ్చు. వారి సినిమా సెట్లో నేను ఉంటే .. బసవతారకం గారు వచ్చి పలకరించేవారు. అలాంటివారి అభిమానాన్ని పొందడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి" అన్నారు.
"శోభన్ బాబు గారు అందరితోను చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఆ ప్రవర్తన కారణంగా అందరూ అభిమానంతో ఉండేవారు. అప్పట్లో ఆయన భూమిపై పెట్టుబడి పెట్టడం వలన ఆయన బిడ్డలంతా హ్యాపీగా ఉన్నారు. నాతో కూడా చెప్పారు .. కానీ నేను దానిని అంత సీరియస్ గా తీసుకోలేదు. అయినా భగవంతుడు ఇచ్చిన దానిలో నేను సంతృప్తితోనే ఉన్నాను. నా స్థాయిలో నేను సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను" అని చెప్పారు.