Suryakumar Yadav: టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ అరుదైన ఫీట్!

- వాంఖడేలో నిన్న రాత్రి కేకేఆర్, ఎంఐ మ్యాచ్
- కోల్‌కతాను 8 వికెట్ల తేడాతో ఓడించిన ముంబయి
- 9 బంతుల్లోనే అజేయంగా 27 రన్స్ బాదిన సూర్య
- తద్వారా టీ20ల్లో 8000 పరుగుల మైలురాయి
- కోహ్లీ, రోహిత్, ధావన్, రైనా తర్వాత ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డ్
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఎంఐ చిత్తు చేసింది. దీంతో ముంబయి ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఇక ఈ మ్యాచ్ లో ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. 9 బంతుల్లోనే 2 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయంగా 27 పరుగులు చేశాడు. తద్వారా సూర్య టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో 8000 పరుగుల ఫీట్‌ను నమోదు చేశాడు.
దీంతో సూర్యకుమార్ 8000 కంటే ఎక్కువ టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ ఫీట్ సాధించిన ఐదవ భారత ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా ఉన్నారు. తన కెరీర్ లో 288వ టీ20 మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు.
టీ20ల్లో 8000 ప్లస్ పరుగులు చేసిన భారత బ్యాటర్లు...
విరాట్ కోహ్లీ- 12,976
రోహిత్ శర్మ- 11,851
శిఖర్ ధావన్- 9,797
సురేశ్ రైనా- 8,654
సూర్యకుమార్ యాదవ్- 8,007