Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై ఐజీ ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!

Pastor Praveens Death IG Press Meet Reveals Details
  • హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తూ మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు
  • అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు గుర్తించామన్న ఐజీ
  • ఈ కేసును సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారని వెల్లడి 
  • ఎవరూ అసత్య ప్రచారాలు చేయొద్దని హెచ్చరిక
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసు మిస్టరీగా మారింది. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి బైక్ పై వచ్చే క్రమంలో... రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉండడం అనుమానాలకు దారితీసింది. దీనిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఐజీ అశోక్ కుమార్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు గుర్తించామని తెలిపారు. 

తాజాగా దీనిపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును పర్యవేక్షణ చేస్తున్నారని ఐజీ వివరించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారని, ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారని వెల్లడించారు. 

"పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో బయల్దేరారు. ఆ రోజు మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్ గేటు దాటారు. విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడున్నారనేది ఆరా తీస్తున్నాం. టెక్నాలజీ సాయంతో ట్రాకింగ్ చేస్తున్నాం. కొంతమూరు బంక్ వద్దకు రాత్రి 11.40 గంటలకు ప్రవీణ్ చేరుకున్నారు. రాత్రి 11.42 గంటలకు ఘటన జరిగింది. 

పోస్టుమార్టంకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు. ప్రవీణ్ చేతులు, ముఖంపై గాయాలు ఉన్నట్టు తెలిసింది. పోస్టుమార్టం పూర్తి వివరాలు వచ్చాక, ప్రవీణ్ ఎలా మరణించారన్నది తెలుస్తుంది. కారు ఢీకొడితే బైక్ కింద పడిందా? అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ అసత్య ప్రచారాలు చేయొద్దు. 

హైదరాబాద్, విజయవాడలో సీసీ కెమెరాల డేటా తీసుకుంటున్నాం. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజి తీసుకున్నాం. ఒక్కో సెకనుకు 15 ఫ్రేముల చొప్పున సీసీ కెమెరా ఫుటేజి తీసి పరిశీలించాం. రాజమండ్రి లాలా చెరువు వద్ద కుమార్తె పేరుతో ప్రవీణ్ స్థలం కొన్నారు. అందులో బిల్డింగ్ కట్టాలనుకున్నారు... ఆ స్థలానికి దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు కూడా తీసుకున్నారు. 

ప్రవీణ్ రాజమండ్రి వస్తున్న విషయం భార్యకు, ఆకాశ్, జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఇప్పటికే ప్రవీణ్ కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించాం. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు కూడా పరిశీలిస్తాం" అని ఐజీ అశోక్ కుమార్ వివరించారు.
Pastor Praveen
Rajamahendravaram
AP Police
IG Ashok Kumar
Mysterious Death
Road Accident
Investigation
CCTV Footage
East Godavari District
Andhra Pradesh

More Telugu News