Mark Carney: అమెరికాతో పాత దోస్తీ ముగిసింది... కెన‌డా ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Canadas PM Declares End of Old Friendship with US

  • కెన‌డా ఆటో రంగంపై ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌
  • కెనడా, యూఎస్‌ మధ్య ఇన్నాళ్లు ఉన్న‌ ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు ముగిశాయ‌ని ప్ర‌క‌ట‌న‌
  • కెన‌డా నుంచి వాహనాల దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌... కెన‌డా ఆటో రంగంపై అధిక సుంకాన్ని విధించ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటుగా స్పందించారు. అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని తెలిపారు. కెనడా, అమెరికా మధ్య ఇన్నాళ్లు ఉన్న‌ ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాల యుగం ముగిసింద‌ని ప్రధాన మంత్రి గురువారం అన్నారు.  

కెన‌డా నుంచి వాహనాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తూ ఇటీవ‌ల‌ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. వచ్చే వారం ఇది అమల్లోకి రానుంది. ట్రంప్ నిర్ణ‌యం 5,00,000 మంది ఉద్యోగులు ఉన్న‌ కెనడియన్ ఆటో పరిశ్రమకు చేటు చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పేర్కొన్నారు.

ట్రంప్ ఆటో సుంకాలను 'అన్యాయమైనది' గా ఆయన అభివర్ణించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘన‌గా మార్క్ కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ అమెరికాతో సంబంధాలను శాశ్వతంగా మార్చేశారని, భవిష్యత్తులో ఏవైనా వాణిజ్య ఒప్పందాలు ఉన్నా తాము వెనక్కి తగ్గ‌బోమ‌ని ఆయన తెలిపారు.

ఆటో సుంకాలకు వ్యతిరేకంగా కెనడా ప్రతీకారం తీర్చుకుంటుందని ప్ర‌ధాని చెప్పారు. "అమెరికాపై గరిష్ట ప్రభావాన్ని చూపే, కెనడాపై కనీస ప్రభావాన్ని చూపే మా సొంత‌ ప్రతీకార వాణిజ్య చర్యలతో మేము అగ్ర‌రాజ్యం సుంకాలను ఎదుర్కొంటాం" అని ఆయన అన్నారు. 

కాగా, మార్చి 14న జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్‌ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులైన విష‌యం తెలిసిందే. సాధారణంగా ఒక కొత్త కెనడా నాయకుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడటం ఆన‌వాయితీ. కానీ ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు.

ట్రంప్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, అధ్యక్షుడు కెనడా పట్ల గౌరవం చూపించే వరకు, ముఖ్యంగా పదే పదే తన విలీన బెదిరింపులను ఆపే వరకు వాణిజ్య చర్చలలో పాల్గొననని ప్ర‌ధాని మార్క్‌ కార్నీ స్పష్టం చేశారు.

Mark Carney
Canada Prime Minister
Donald Trump
US-Canada Relations
Auto Tariffs
Trade Dispute
Canadian Auto Industry
Trade War
North American Trade
International Relations
  • Loading...

More Telugu News