YS Jagan: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

YS Jagans Sensational Remarks Against Pawan Kalyan

  • ప‌వ‌న్‌కు హిందూ ధ‌ర్మంపై, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు లేద‌న్న జ‌గ‌న్‌
  • కాశినాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఒక్క మాట కూడా మాట్లాడలేద‌ని ఫైర్
  • ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా పోస్టు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్‌పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూ ధ‌ర్మంపై, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు లేద‌న్నారు. కాశినాయన క్షేత్రాన్ని అధికారులు కూల్చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేద‌ని ఫైర్ అయ్యారు. ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతల నేప‌థ్యంలో ఈ మేర‌కు జ‌గ‌న్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టారు. 

"దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?

అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. 

మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. 

సీఎం చంద్ర‌బాబు గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం?

తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. 

ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా?" అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. 


YS Jagan
Pawan Kalyan
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Kasinayana Kshetram Demolition
Hindu Temples
Religious Controversy
AP Government
Environmental Issues
Temple Protection
Deputy CM
  • Loading...

More Telugu News