Komatireddy Rajagopal Reddy: రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫాంహౌస్ లో హాయిగా ఉన్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు చేసిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- బీఆర్ఎస్ కు నాయకుడే లేడని ఎద్దేవా
- అధికారం లేకపోయేసరికి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శ
పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటిరెడ్డి చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారని... లేకపోతే నిన్నటి నుంచి ఒక లెక్క, ఈరోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండేదని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షమే లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమకు నీతులు చెబుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ కు నాయకుడే లేడని... అసెంబ్లీకి రావడమే మానేశారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలన అహంకారంతో సాగిందని కోమటిరెడ్డి విమర్శించారు. అప్పుడు సభలో మేము ఆరుగురం ఉన్నప్పుడు తమ గొంతు నొక్కారని... సభ మీ సొంతమా? అని మండిపడ్డారు. అధికారం లేకపోయేసరికి బీఆర్ఎస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడటం కంటే... ఆ సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పారు.