Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు

- 9 నెలల్లో ఉద్యోగులకు రూ.7,230 కోట్ల బకాయిలు విడుదల చేశామన్న సీఎం
- గత ప్రభుత్వం రూ.20,637 కోట్ల బకాయిలు పెట్టిందని వ్యాఖ్య
- సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలు విడుదల చేస్తామని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిన బకాయిలలో రూ.7,230 కోట్లను ప్రస్తుతానికి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదివరకే రూ.1,030 కోట్లు విడుదల చేశామని, తాజాగా ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు.
సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి న్యాయంగా అందాల్సిన అలవెన్సులు అందించకుండా గత ప్రభుత్వం ఏకంగా రూ.20,637 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు ఆ బకాయిలలో కొంత చెల్లించిందన్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు వారి బకాయిలు విడుదల చేస్తున్నామని చెప్పారు. మిగిలిన బకాయిలు కూడా వెసులుబాటును బట్టి విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చొరవ తీసుకోవాలని సూచించారు.
పీ4 కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఉద్యోగుల కుటుంబాలు కూడా తమకు చేతనైనంతలో ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.