MS Dhoni: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ధోనీ స్పందన

- ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను సమర్ధించిన ధోని
- మొదట్లో ఇది అనవసరం అని భావించానని వ్యాఖ్య
- అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో ఆటగాళ్లు భయం లేకుండా మరింత దూకుడుగా ఆడుతున్నారన్న ధోని
ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్రవేశపెట్టారు. తాజాగా ఆ నిబంధనను ధోని సమర్ధించాడు. ఈ నిబంధనను అమలు చేసిన మొదట్లో ఇది అనవసరమని అనిపించిందని ధోని అన్నాడు. ఒక విధంగా ఈ నిబంధన తనకు అనుకూలం అవుతుంది కానీ తనకు దీని అవసరం లేదన్నాడు. తాను ఇప్పటికీ వికెట్ కీపింగ్ చేస్తానని కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ని కాదని అన్నాడు. ఆటలో పాలుపంచుకోవడమే తనకు ఇష్టమన్నాడు. ఈ నిబంధన వల్ల మ్యాచ్‌ల్లో మరిన్ని భారీ స్కోర్లు నమోదవుతాయని చాలా మంది అంటున్నారని, తానైతే పిచ్ పరిస్థితులు, ప్లేయర్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా భారీ స్కోర్‌కు కారణమని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో ఆటగాళ్లు భయం లేకుండా మరింత దూకుడుగా ఆడుతున్నారని ధోని పేర్కొన్నాడు. అలా అని నలుగురైదుగురు ఎక్స్ ట్రా బ్యాటర్లను జట్లు ఆడించడం లేదన్నాడు. అదనపు బ్యాటర్ ఉన్నాడనే భరోసాతో మాత్రం ముందుగా వచ్చి బ్యాటింగ్ చేసే ప్లేయర్ల ఆటతీరును మార్చేస్తోందని, టీ 20 క్రికెట్ ఇలాగే మారిపోయిందని ధోని వివరించాడు.