Jagan Mohan Reddy: ముద్దాయికి పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తారా?: జగన్ వ్యాఖ్యలపై వర్ల రామయ్య ఫైర్

- వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు
- పవన్ కుమార్ అనే వైసీపీ మద్దతుదారుడ్ని విచారించిన పోలీసులు
- విచారణలో పోలీసులు తనను కొట్టారని జగన్ కు చెప్పుకున్న పవన్
- అదే డీఎస్సీ, అదే సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తానన్న జగన్
- జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వర్ల రామయ్య
వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు వైసీసీ మద్దతుదారుడు పవన్ కుమార్ ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే, విచారణ సమయంలో పోలీసులు తనను కొట్టారని పవన్ కుమార్... వైసీపీ అధినేత జగన్ వద్ద వాపోయాడు. అందుకు జగన్ స్పందిస్తూ... ధైర్యంగా ఉండు, మనం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం... నిన్ను కొట్టిన ఆ డీఎస్పీ, ఆ సీఐతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా అని పవన్ కుమార్ తో అన్నారు.
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ గారూ... ఓ కేసులో ముద్దాయిగా ఉన్న పవన్ అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తే... మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐ, డీఎస్పీతో ముద్దాయికి సెల్యూట్ కొట్టిస్తాననడం తగునా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా రాష్ట్రానికి ఇలాగే చేశారా? పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తారా? అసాంఘిక శక్తిలా మాట్లాడతారా? అని వర్ల రామయ్య నిలదీశారు.