Natasha Stankovic: హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత మళ్లీ ప్రేమలో పడిందా?... నటాషా స్టాంకోవిచ్ స్పందన ఇదే!

ప్రముఖ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ఆమె 2024లో జులైలో విడిపోయారు. నటాషా ఇటీవలే (మార్చి 4) తన 33వ పుట్టినరోజు జరుపుకున్నారు. గత కొంతకాలంగా నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి. ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో పబ్లిక్ గా కనిపించడంతో ఊహాగానాలకు రెక్కలొచ్చాయి.
తాజాగా, మళ్లీ ప్రేమలో పడ్డారా? అన్న ప్రశ్నకు నటాషా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రేమలో పడడానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జీవితం ఏం అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు.
"నమ్మకం, అవగాహనతో నిర్మితమైన అర్థవంతమైన సంబంధాలకు నేను విలువ ఇస్తాను. ప్రేమ నా ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను, అంతకుమించి ప్రేమ గురించి నిర్వచించలేం" అని తెలిపారు.
ఇక, గత సంవత్సరం తనకు చాలా కష్టంగా గడిచిందని, హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను బాధించిందని నటాషా చెప్పారు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మరింత రాటుదేలుతామని, సవాళ్లను ఇష్టపడతానని వివరించారు. మనుషులు వయసుతో కాకుండా అనుభవాలతో పరిణతి చెందుతారని నటాషా అభిప్రాయపడ్డారు.
నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా 2020 మేలో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత వారు విడిపోయారు. విడిపోతున్నట్టు ప్రకటిస్తూ, ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఇది ఒక 'కఠినమైన నిర్ణయం' అని పేర్కొన్నారు.