Suman: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

- ఎన్డీయే ప్రభుత్వం ప్రజలు మెచ్చే పాలన అందిస్తోందన్న నటుడు
- నటుడిగా, రాజకీయ నాయకుడిగా బ్యాలెన్స్ గా పవన్ పనిచేస్తున్నారని కితాబు
- తిరుమలలో ఎన్నో మార్పులను గమనించానన్న సుమన్
ప్రముఖ సినీనటుడు సుమన్ తిరుపతిలో ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంబినేషన్ బాగుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలు మెచ్చే పాలన అందిస్తోందని కితాబిచ్చారు. అన్ని పథకాలను ఒక్కసారిగా అమలు చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని, ఒక్కొక్క పథకాన్ని చంద్రబాబు అమలు చేస్తూ వెళుతున్నారని తెలిపారు.
ఇక పవన్ కల్యాణ్... నటుడిగా, రాజకీయ నాయకుడిగా బ్యాలెన్స్ గా పనిచేస్తున్నారని సుమన్ చెప్పారు. తిరుమలలో ఎన్నో మార్పులను గమనించానన్నారు. టీటీడీ ఛైర్మన్ గా బి.ఆర్.నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత మార్పులను గమనిస్తున్నానని తెలిపారు. పాలకమండలి సమావేశాల్లో సామాన్య భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలనే తీసుకుంటున్నారన్నారు.
సామాన్య భక్తులకు గదులు సులువుగా దొరుకుతున్నాయని, గంటల తరబడి కాకుండా త్వరితగతిన భక్తులకు దర్సనభాగ్యం లభిస్తోందని చెప్పారు. ఇక విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం మరింత పెంపొందే అవకాశం ఉంటుందని సుమన్ పేర్కొన్నారు.
హిందీ భాష అవసరమే, కానీ బలవంతంగా ఆ భాషను రుద్దాలని చూడడం మాత్రం మంచిదికాదన్నారు. ఇక దళపతి విజయ్ తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడని సుమన్ చెప్పుకొచ్చారు.