Vidala Rajani: స్టోన్ క్రషర్స్ పై విడదల రజని దాడులు చేయించారు: ఐపీఎస్ అధికారి జాషువా

- విడదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసు
- స్టోన్ క్రషర్స్ పై విడదల రజని ఫిర్యాదు చేశారన్న జాషువా
- ఫిర్యాదు పత్రాలు కార్యాలయం నుంచి మాయమయ్యాయని వెల్లడి
శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాని కూడా నిందితుడిగా చేర్చారు. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు జాషువా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వెలుగుచూసింది.
2019 జూన్ 24 నుంచి 2021 ఆగస్టు 24 వరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా పని చేశానని ఆయన తెలిపారు. అప్పటి చిలకూలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని తమ కార్యాలయానికి వచ్చి శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ పై లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. అక్రమంగా మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారని... ఆ ఆరోపణలపై తాను ప్రాథమికంగా రహస్య విచారణ చేయించానని తెలిపారు.
స్టోన్ క్రషర్ యాజమాన్యం నాటి టీడీపీ నేత సానుభూతిపరులదని... వారితో విడదల రజనికి రాజకీయ శత్రుత్వం కొనసాగుతోందని తేలిందని చెప్పారు. స్టోన్ క్రషర్స్ పై విడదల రజని దాడులు చేయించారని పేర్నొన్నారు. విడదల రజని ఫిర్యాదు మేరకే తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కార్యాలయం నుంచి మాయమయ్యాయని చెప్పారు. విజిలెన్స్ ఫైల్స్ ట్యాంపరింగ్ చేసి కొన్నింటిని తొలగించారని తెలిపారు.