Raja Singh: సొంతపార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

- పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపణ
- జైలుకు పంపించే ప్రయత్నం చేశారని వెల్లడి
- తనపై పీడీయాక్ట్ పెట్టాలని పోలీసులకు బీజేపీ నేతలే చెప్పారన్న ఎమ్మెల్యే
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు సూచించారని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ రాజాసింగ్ అసెంబ్లీకి హాజరు కావడంలేదు. దీనిపై పార్టీలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్న వేళ రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైనా రాజాసింగ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యే వారిని కాకుండా, పార్టీ కోసం కష్టించి పనిచేసే నికార్సైన లీడర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే లీడర్ ను అధ్యక్షుడిగా చేస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన అన్నారు.