Krishna Vamsi: అల్లూరి సమాధిని సందర్శించిన ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు కృష్ణవంశీ

- అల్లూరి, గంటం దొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి నివాళులు
- వారిద్దరితో పాటు నేనుసైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుసిరెడ్డి శివ
- అల్లూరి చరిత్రతో మంచి చిత్రాన్ని తెరకెకెక్కించడానికి ప్రయత్నిస్తున్నానన్న కృష్ణవంశీ
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సినీ దర్శకుడు కృష్ణవంశీ సోమవారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి విచ్చేశారు. స్థానిక నేనుసైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ... "కృష్ణవంశీ గొప్ప దేశ భక్తుడు. ఆయన అల్లూరి సమాధి వద్ద మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి నమస్కారం చెయ్యడం ఆయన భక్తి భావానికి నిదర్శనీయం. ఆ క్షణంలో ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా గుర్తుకు వచ్చింది. దేశభక్తి కలిగినటువంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా కృష్ణవంశీ నిలిచారు" అని అన్నారు.
దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ... "ఎన్నో ఏళ్లుగా అల్లూరి నడయాడిన ప్రాంతాలను సందర్శించాలనే తపన ఉండేది. నేటితో ఆ కోరిక తీరింది. గోకరాజు నారాయణరావు అనే ఒక పత్రిక ఎడిటర్ అల్లూరి చరితపై 20 ఏళ్లు రీసెర్చ్ చేసి ఆకుపచ్చ సూర్యోదయం అనే పుస్తకం రాశారు. అది చదివిన తరువాత అల్లూరి సీతారామరాజు పోరాటం, కొనసాగించిన ప్రదేశాలను ఎలాగైనా సందర్శించాలనే పట్టుదల పెరిగింది. అవకాశం ఉన్నంత మేర అల్లూరి చరిత్రతో మంచి చిత్రాన్ని తెరకెకెక్కించడానికి ప్రయత్నిస్తున్నాను" అని అన్నారు.
కార్యక్రమం అనంతరం నేనుసైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో నివాసం ఉంటున్న అల్లూరి ప్రధాన అనుచరుడు గంటం దొర కుటుంబ సభ్యులను పరామర్శించి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేనుసైతం వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివ పాల్గొన్నారు.



