Nicholas Pooran: విశాఖలో పూరన్, మార్ష్ విధ్వంసం... లక్నో భారీ స్కోరు

- ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసిన లక్నో
విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు నికోలాస్ పూరన్, మిచెల్ మార్ష్ రెచ్చిపోయి ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో వీరిద్దరూ పరుగుల వర్షం కురిపించడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 15 పరుగుల చేసి అవుటయ్యాడు.
అక్కడ్నించి నికోలాస్ పూరన్, మిచెల్ మార్ష్ విధ్వంసక బ్యాటింగ్ తో విశాఖ స్టేడియం హోరెత్తిపోయింది. ఇద్దరూ సిక్సులు, ఫోర్లలతో విరుచుకుపడ్డారు. పూరన్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 75 పరుగులు చేయగా... మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 72 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత లక్నో స్కోరు నిదానించింది. చివర్లో డేవిడ్ మిల్లర్ భారీ షాట్లు కొట్టడంతో లక్నో స్కోరు 200 మార్కు దాటింది. మిల్లర్ 19 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (0) డకౌట్ అయ్యాడు. ఆరు బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. శార్దూల్ ఠాకూర్ ది కూడా అదే పరిస్థితి. అతడు కూడా డకౌటే. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుల్దీప్ యాదవ్ 2, విప్రాజ్ నిగమ్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు.