Rahul Gandhi: రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి అలహాబాద్ కోర్టు నాలుగు వారాల గడువు

- నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలన్న అలహాబాద్ హైకోర్టు
- తదుపరి విచారణ ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
- కొన్నాళ్లుగా రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై వివాదం
రాహుల్ గాంధీ పౌరసత్వం వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణకు ఎనిమిది వారాల గడువు కావాలని కేంద్రం కోరగా, న్యాయస్థానం నాలుగు వారాల గడువును మాత్రమే మంజూరు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21వ తేదీకి లక్నో బెంచ్ వాయిదా వేసింది. ఈ వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
రాహుల్ గాంధీ పౌరసత్వం అంశం కొంతకాలంగా వివాదాస్పదంగా ఉంది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
బ్రిటన్‌లో నమోదైన ఒక కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. దీని ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ని రాహుల్ గాంధీ ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు.