Gaddwal Vijaya Lakshmi: జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కనిపించడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్ ఫిర్యాదు!

- జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ శ్రవణ్
- జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన
- కనీసం కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదు
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడం లేదని శ్రవణ్ ఆరోపించారు. కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయన అన్నారు.
నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారం కోసం ఆమె స్వయంగా పర్యటించడం లేదని పేర్కొన్నారు.
కనీసం కార్యాలయంలో కూడా ఆమె అందుబాటులో ఉండకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అన్నారు. పలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, చెత్త సమస్య, రోడ్ల దుస్థితి వంటి అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మేయర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.