Harish Rao: ఆ బిడ్డ దీన స్థితికి బాధ్యులు ఎవరు?: హరీశ్ రావు

- ఎంఎంటీఎస్ రైల్లో ఉద్యోగినిపై అత్యాచార యత్నం
- రాష్ట్రంలో ప్రతి నెల 250 అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయన్న హరీశ్
- కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మండిపాటు
ఎంఎంటీఎస్ రైల్లో ఉద్యోగినిపై అత్యాచార యత్నం కలకలం రేపింది. ఈ ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే... ప్రభుత్వం, పోలీసులు, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కీచకుడి నుంచి కాపాడుకోవడానికి బాధితురాలు రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడిందని... గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బిడ్డ దీన స్థితికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యాచార కేసులు పెరిగాయని సాక్షాత్తు డీజీపీ ప్రకటించారని చెప్పారు. డీజీపీ చెప్పిన లెక్కల ప్రకారం ప్రతి నెల 250 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలు అత్యాచారాలు, వేధింపులు, హత్యలకు గురవుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని చూస్తోందని హరీశ్ విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పడం కాదని... ముందు మహిళల మాన, ప్రాణాలకు భద్రత కల్పించాలని చెప్పారు.