Prasanna Shankar Narayan: రచ్చకెక్కిన టెక్ బిలియనీర్ ఇంటి వ్యవహారం... భర్త ఒక 'కామపిశాచి' అన్న భార్య

- పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న ప్రసన్న శంకర్, దివ్య
- అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్
- నెలకు రూ.9 కోట్ల భరణంపై చర్చలు
- అమెరికా నుంచి భారత్ చేరిన వ్యవహారం
ప్రముఖ హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు, అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ ప్రస్తుతం తన భార్యతో విడాకుల వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడి ప్రస్తుతం తాను పరారీలో ఉన్నానని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం రేపింది. ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ కేసులో చెన్నై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించడం, ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే...
ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
ప్రసన్న శంకర్ ఏమంటున్నారంటే...
తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అయితే... అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్ లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.
కుమారుడితో కలిసి భారత్ వచ్చిన దివ్య
అమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించారు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.
కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని... పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపిస్తున్నారు.
దివ్య ఏమంటున్నారంటే....
తాను, తన కుమారుడు అమెరికా పౌరులమని దివ్య వెల్లడించారు. ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు.