KTR: రైలు నుంచి దూకిన యువతి... హైదరాబాద్‌లో భద్రతపై కేటీఆర్ ఆందోళన

- యువకుడు అత్యాచారయత్నం చేయడంతో ఎంఎంటీఎస్ నుండి దూకిన యువతి
- గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి
- నగరంలో నేరస్థులు దారుణాలకు పాల్పడేందుకు వెనుకడటం లేదన్న కేటీఆర్
హైదరాబాద్ నగరంలో పట్టపగలు నేరస్థులు దారుణాలకు పాల్పడేందుకు వెనుకాడటం లేదని, ఇందుకు ఎంఎంటీఎస్ రైలు నుంచి ఒక యువతి దూకిన ఘటనే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అత్యాచారయత్నం నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి కదులుతున్న రైలు నుంచి దూకవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరమని కేటీఆర్ అన్నారు.
ఈ ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరిగేలా చూడాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను డిమాండ్ చేస్తున్నానని 'ఎక్స్' వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసులు, తెలంగాణ మహిళా-శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బాధితురాలికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
ఈ అంశం రైల్వేల పరిధిలో ఉన్నప్పటికీ, ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నట్లు ఈ ఘటన ద్వారా వెల్లడవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేరస్థులు పట్టపగలు దారుణమైన నేరాలు చేయడానికి ఎందుకు భయపడటం లేదని ఆయన ప్రశ్నించారు.
అనంతపురం జిల్లాకు చెందిన యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ రైలులో వెళుతోంది. ఆమె మహిళల కోచ్ ఎక్కింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఘటన జరిగినప్పుడు బోగీలో ఆమె ఒక్కతే ఉండటం గమనించి యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందకు దూకింది. గాయపడిన ఆమెను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.