Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు

- పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్
- ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' లో ప్రత్యేకంగా ప్రస్తావించారన్న చంద్రబాబు
- లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉదారంగా అనుమతిచ్చారని వెల్లడి
- మన గిరిజన రైతులకు గర్వకారణం అని వివరణ
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పార్లమెంటులో కాఫీ ప్రియులకు శుభవార్త... మీరు ఇకపై పార్లమెంటు ఆవరణలోనే తయారుచేసిన అరకు కాఫీని ఆస్వాదించవచ్చు అంటూ ట్వీట్ చేశారు.
"మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రోత్సాహ వచనాలు మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. అలాగే, పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉదారంగా అనుమతి ఇచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు. ఈ మైలురాయి వంటి ఘటనను సాకారం చేయడంలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ముఖ్యంగా, పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కావడం మన గిరిజన రైతులకు గర్వకారణం. వారి అంకితభావం, కృషి అరకు కాఫీని జాతీయస్థాయిలో ఉన్నతంగా నిలిపాయి. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు మన గిరిజన రైతుల స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని కూడా గుర్తుచేసుకుందాం" అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మేరకు పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.

