IPL Match: వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్... ట్రాఫిక్ ఆంక్షలు

- విశాఖపట్నం వేదికగా ఈరోజు రాత్రి డీసీ, ఎల్ఎస్‌జీ మ్యాచ్
- 1,700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు
- మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖపట్నం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1,700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల కోసం స్టేడియాన్ని మరమ్మతులు నిర్వహించేందుకు రూ. 40కోట్లు వెచ్చించారు.
ఇందులో భాగంగా కొత్త ఎల్ఈడీ లైట్లతో పాటు 34 ఆడియన్స్ బాక్సులను ఏర్పాటు చేశారు. అన్ని హంగులతో వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ముస్తాబు అయింది. ఇక ఈరోజు మ్యాచ్ నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలకు వికన్వేషన్ వద్ద బీ గ్రౌండ్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలకు సాంకేతిక కళాశాలలో పార్కింగ్ కేటాయించారు.
విజయవాడ వెళ్లే వాహనాలను ఆనందపురం, అనకాపల్లి రహదారి వైపు మళ్లించడం జరిగింది. విజయవాడ నుంచి విశాఖకు వచ్చే వాహనాలను అనకాపల్లి, అనంతపురం, నేషనల్ హైవే వైపు మళ్లించారు.