Pawan Kalyan: తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై... పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan on Jana Sena Tamil Nadu Entry

  • ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగుపెడుతుందన్న పవన్
  • సినీ నటులు రాజకీయాల్లో గెలవడం అంత ఈజీ కాదని వ్యాఖ్య
  • విజయ్, పళనిస్వామి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో? లేదో? చెప్పలేనన్న పవన్

జనసేన పార్టీ విస్తరణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు జరగాలని ఉంటే... తమిళనాడులో జనసేన కచ్చితంగా అడుగు పెడుతుందని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి వ్యక్తి అని... ప్రత్యర్థులపై పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సిందేనని చెప్పారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని... దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానమని అన్నారు. రాజకీయాల్లో ఎంతో ఓపిక అవసరమని చెప్పారు. 

సినీ నటులు రాజకీయాల్లో గెలవడం అంత ఈజీ కాదని అన్నారు. ఆ ఘనత కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమయిందని చెప్పారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అద్భుతమని కితాబునిచ్చారు. తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్ ను తాను ఆదర్శంగా తీసుకుంటానని తెలిపారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లకు వచ్చిన అవకాశం మరెవరికీ రాలేదని చెప్పారు. మనం ఎంత పాప్యులర్, మన వద్ద ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదని... మన ఐడియాలజీ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లిందనేదే ముఖ్యమని అన్నారు.

రాజకీయరంగం అత్యంత కఠినమైనదని... ఇక్కడ అందరూ శత్రువులేనని పవన్ చెప్పారు. రాజకీయాల వల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుందని తెలిపారు. తమిళనాడులో విజయ్, పళనిస్వామి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో? లేదో? తాను చెప్పలేనని అన్నారు. ఇరువైపులా ఓట్ల షేరింగ్ జరుగుతుందా? అనేది కూడా అనుమానమేనని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని అన్నారు. తమిళనాడులో టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం కుదురుతుందో? లేదో? చెప్పలేమని అన్నారు.

  • Loading...

More Telugu News