Andhra Pradesh: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన

- క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్న అధికారులు
- విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం
ఏపీలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, చేతికి అందివచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. దీనికి తోడు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని... సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో... వర్షాలు కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.