Riya Chakraborty: రియా చక్రవర్తికి మీడియా క్షమాపణ చెప్పాలి.. నటి దియా మీర్జా డిమాండ్

- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో రియాకు వ్యతిరేకంగా వార్తలు
- తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యేనని తేల్చిన సీబీఐ
- ఈ వ్యవహారంలో రియాను దోషిగా చూపే ప్రయత్నం జరిగిందన్న దియా మీర్జా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణంపై అప్పట్లో రియా చక్రవర్తిని దోషిగా చూపే ప్రయత్నం జరిగిందని నటి దియా మీర్జా ఆరోపించారు. సుశాంత్ మరణం వెనుక రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే కోణంలో మీడియా కథనాలు ప్రచురించిందని విమర్శించారు. ఆ సమయంలో జరిగిన ప్రచారంతో రియా కుటుంబం అవమానాల పాలైందన్నారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని, ఆయనే ఆత్మహత్యకు పాల్పడ్డారని సీబీఐ తేల్చిందని గుర్తుచేశారు. అప్పట్లో రియాను, ఆమె కుటుంబాన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేసినందుకు మీడియా ఇప్పుడు క్షమాపణ చెప్పాలని దియా మీర్జా డిమాండ్ చేశారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. టీఆర్ పీ కోసం నిరాధార కథనాలను వండివార్చిందంటూ మీడియాపై దియా మండిపడ్డారు. మీడియా వేధింపులకు రియా, ఆమె కుటుంబం ఎంతో క్షోభ అనుభవించిందని చెప్పారు. సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా, సీబీఐ క్లీన్ చిట్ పై నటి రియా చక్రవర్తి ఇప్పటి వరకూ స్పందించలేదు. రియా సోదరుడు మాత్రం ‘సత్యమేవ జయతే’ అంటూ రియా ఫొటోతో ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.