MS Dhoni: మహేంద్రుడా మజాకా... వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా.. వైరల్ వీడియో!

- నిన్న చిదంబరం స్టేడియంలో ఎంఐ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్
- నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ విక్టరీ
- 0.12 సెకన్ల మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి అందరినీ స్టన్ చేసిన ధోనీ
- నెట్టింట వైరల్ అవుతున్న ఎంఎస్‌డీ మ్యాజిక్ వీడియో
ఆదివారం చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో ముంబయి ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) విజయం సాధించి ఐపీఎల్ 18వ సీజన్‌లో శుభారంభం చేసింది. మొదట బౌలింగ్‌లో అదరగొట్టిన సీఎస్‌కే, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. ముంబయి నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి, మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. కేవలం 0.12 సెకన్ల మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి వింటేజ్ ధోనీని గుర్తు చేశాడు. ముంబయి ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో సీఎస్‌కే బౌలర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని వికెట్ల వెనుక అత్యంత వేగంగా అందుకున్న ధోనీ క్షణాల్లో బెయిల్స్‌ను గిరాటేశాడు.
దీంతో ఎంఐ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజును వీడాల్సి వచ్చింది. ఈ మ్యాజికల్ స్టంపింగ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వికెట్ల వెనుక ధోనీ ఉంటే బ్యాటర్లకు దడే అని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.