Bollywood Actress: ప్రారంభోత్సవానికని పిలిచి వ్యభిచారం చేయాలని ఒత్తిడి.. హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి

Bollywood Actress Attacked in Hyderabad

  • నటికి ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన స్నేహితురాలు
  • 18న హైదరాబాద్‌కు చేరుకుని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసిన నటి
  • ఇద్దరు మహిళలు వచ్చి తమతోపాటు వ్యభిచారం చేయాలని ఒత్తిడి
  • ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు తమతో గడపాలని డిమాండ్
  • గదిలో బంధించిన నటిని విడిపించిన పోలీసులు 

హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. షాప్ ప్రారంభోత్సవం కోసమని పిలిచి వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో సదరు నటి నిరాకరించింది. దీంతో నిందితులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలో ఉంటున్న బాలీవుడ్/టీవీ నటికి ఈ  నెల 17న హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు ఫోన్ చేసింది. ఇక్కడ ఓ షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించింది. విమాన చార్జీలు, పారితోషికం ఇస్తారని చెప్పింది. దీంతో ఆమె ఈ నెల 18న హైదరాబాద్ చేరుకుంది. మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. అక్కడామెకు ఓ వృద్ధురాలు అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది. 

ఈ నెల 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు అపార్ట్‌మెంట్‌కు వచ్చి తమతో కలిసి వ్యభిచారం చేయాలని నటిపై ఒత్తిడి తెచ్చారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. అందుకామె నిరాకరించడంతో దాడి చేశారు. దీంతో ఆమె గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. 

ఆ వెంటనే ఇద్దరు మహిళలు, వృద్ధురాలు నటిని గదిలో బంధించి రూ. 50 వేల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధిత నటి వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని విడిపించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News