Salman Khan: రష్మికకు, తనకు ఏజ్ డిఫరెన్స్ పై సల్మాన్ ఖాన్ స్పందన

- ఈ నెల 30న విడుదల కానున్న సికిందర్ మూవీ
- ప్రధాన పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్, రష్మిక
- వయసు తేడాపై ఆమె (రష్మిక)కు లేని ఇబ్బంది మీకెందుకని ప్రశ్నించిన సల్మాన్ ఖాన్
కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సికిందర్' చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈద్ సందర్భంగా మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ల వయసు వ్యత్యాసం గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ఆ విషయంలో ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకని ప్రశ్నించారు.
తనకు, హీరోయిన్‌కు మధ్య దాదాపు 31 ఏళ్ల వయసు తేడా ఉందని కొందరు అంటున్నారని సల్మాన్ ఖాన్ అన్నారు. హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకని ప్రశ్నించారు. రష్మికకు పెళ్లయి పాప పుడితే ఆమె కూడా బిగ్ స్టార్ అవుతుందని ఆయన అన్నారు. అప్పుడు కూడా కలిసి నటిస్తామని, తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని సల్మాన్ పేర్కొన్నారు.