MD Salma: రాజమండ్రిలో తల్లీకుమార్తె దారుణ హత్య

- హుకుంపేట వాంబే కాలనీలో ఘటన
- కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు
- ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న వైనం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. హుకుంపేట వాంబే కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరుకు చెందిన ఎండీ సల్మా (38), ఆమె కుమార్తె సానియా (16)ను ఓ యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. హత్య జరిగిన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంధువులు ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ నరసింహ కిశోర్, ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ విద్య, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.
సానియాను ప్రేమించిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.