Mumbai Indians: అతి కష్టమ్మీద 155 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్

- ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × ముంబయి ఇండియన్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు
- 31 పరుగులు చేసిన తిలక్ వర్మ
- నూర్ అహ్మద్ కు 4, ఖలీల్ అహ్మద్ కు 3 వికెట్లు
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... రెండూ దిగ్గజ జట్లే. ఈ రెండు జట్లు తలపడుతుంటే ఆ మజాయే వేరు. అయితే, ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మన్లు ఆపసోపాలు పడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి జట్టు చివరికి 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ముంబయి జట్టులో ఎవరూ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తిలక్ వర్మ చేసిన 31 పరుగులే అత్యధికం. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు చేయగా... ర్యాన్ రికెల్టన్ 13, విల్ జాక్స్ 11, రాబిన్ మింజ్ 3, నమన్ ధీర్ 17, మిచెల్ శాంట్నర్ 11 పరుగులు చేశారు. చివర్లో దీపక్ చహర్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 (నాటౌట్) పరుగులు చేయడం వల్ల ముంబయికి ఆమాత్రం స్కోరైనా వచ్చింది.
చెన్నై బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ 4 వికెట్లతో ముంబయి బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. ఖలీల్ అహ్మద్ 3, నాథన్ ఎల్లిస్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.